కాంగ్రెస్ మాట ఇస్తే ఎంతదూరమైనా వెళ్తుంది
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. వేముల వాడ గుడిచెరువు బహిరంగసభలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ... ప్రజలను కాదు.. వేములవాడ రాజన్నను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని వెల్లడించారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 30న మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని తెలిపారు.
దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అన్నారు. పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఇస్తానని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంతో కరీంనగర్ బిడ్డ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎంతదూరమైనా వెళ్తుందన్నారు. ఎంపీగా పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే తెలంగాణను తీసుకువచ్చారు.. బండి సంజయ్ ను గెలిపిస్తే కేంద్రం నుంచి కరీంనగర్ కు ఏం తెచ్చారు..? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎంపీలు కూడా కరీంనగర్ కు ఏం చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పుడు తనను కలవడానికి వచ్చినా చేతి నిండా దస్త్రాలు తీసుకువస్తారని చెప్పారు. ఈ ప్రాంతంలోని నేతన్నలు, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడమే తమ ప్రాధాన్యం అన్నారు. గల్ఫ్ లో తెలంగాణ వాసులు మరిణిస్తే రూ. 5 లక్షలు పరిహారం ఇస్తున్నాం.. ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువన్న సీఎం రేవంత్ పదేళ్లో కేసీఆర్ చేయలేని పనులను పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటారు.. కేటీఆర్, హరీశ్ రావు మన కాళ్ల మధ్యలో కట్టెలు పెడుతున్నారని ముఖ్యమంత్రి ద్వజమెత్తారు. అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు మైండ్ పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ సరిగా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా..? అని ఆయన ప్రశ్నించారు.