హైదరాబాద్ : రైతుల పంటల రుణమాఫీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాతూ.. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని సీఎం పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామని, గతంలో రుణమాఫీ అమలు చేస్తామని బీఆర్ఎస్ ఐదేళ్లు కాలయాపన చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
గత ప్రభుత్వం తొలి ఐదేళ్లలో రూ. 12 వేల కోట్లు మాత్రమే చెల్లించిందని, 2018-23 వరకు రూ.9 వేల కోట్లు కూడా సరిగా చెల్లించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, తొలి విడతలో రూ. లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలి విడుత రైతుల ఖాతాల్లో 6,098 కోట్లు జమ చేస్తున్నామని, రైతుల అప్పులు రూ.2 లక్షల వరకు చెల్లించాలని హామీ ఇచ్చామన్నారు. డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణాల మాఫీకి కటాఫ్ పెటుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిన రోజు డిసెంబర్ 9, తెలంగాణ కల సాకారం చేసిన సోనియా జన్మదినం కావడంతో డిసెంబర్ 9 అనేది మనందరికీ పండుగ రోజు అని చెప్పారు.
రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని, మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ, మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమా చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఆగస్టులోగా రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రుణమాఫీకి ప్రామాణికం పాస్ పుస్తకమే.. రేషన్ కార్డు కాదన్నారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసిందని, వాటికి ప్రతి నెలా రూ.7 వేల కోట్లు వడ్డి చెల్లిస్తున్నామని సీఎ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.