హైదరాబాద్,(విజయక్రాంతి): గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్వవస్థను చిన్నాభిన్నం చేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లినా విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు.. పనిచేసే సీఎంను.. అని దుయ్యాబట్టారు. మన హక్కుల సాధన కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్తాం అన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని, మూసీ సుందరీకరణ ద్వారా హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తామని సీఎం పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విషయంలో కఠినంగా ఉంటున్నామని, సమాజ వికాసంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల కేరళలో ప్రకృతి విలయతాండవం చేసిందని, అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకుండా ఉండేందుకే చెరువులు, నాలాలు, కాపాడుకోవడం కోసం హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ ను గత పాలకులు పదేళ్లలో ఫ్లడ్ సిటీగా మార్చారని దుయ్యాబట్టారు. కొందరు భూమాఫియా దారులు హైడ్రాను బెదిరిస్తున్నారు వారిని వదిలిపెట్టామన్నారు. రైతుల ఖాతాల్లో 6 నెలల వ్యవధిలోనే రూ.18 వేల కోట్లు జామ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ద్వారా 43 లక్షల మందికి మేలు చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తునామని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన సూచించారు. నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.