హైదరాబాద్: న్యూజెర్సీలో ప్రవాస తెలుగు ప్రజల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం ఎన్ఆర్ఐలను కోరారు. తమ పాలనపై అపోహలు, ఆందోళనలకు తావు లేదని సీఎం వెల్లడించారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించేలా కొత్త పారిశ్రామిక విధానం తీసుకువస్తామని తెలిపారు. కొత్త విధానంలో ఆదాయ, నైపుణ్యాల వృద్ధి, ఉపాధి కల్పనకు సమప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎన్నికల ముందు ప్రచారం చేశారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఎక్కువ రోజులు ఉండదన్నారని సీఎం తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామని సీఎం స్పష్టం చేశారు. మెట్రో కోర్ అర్జన్, సెమీ అర్బన్ గా విభజించి పెట్టుబడులకు ప్రత్యేక వ్యవస్థలు రూపొందిస్తామని సూచించారు. రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేక వ్యవస్థలను రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో సిటీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.