09-12-2024 11:43:20 AM
హైదరాబాద్: శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారని ఆయన తెలిపారు. నా తెలంగాణ.. కోటీ రత్నాల వీణ అన్న దాశరథి మాటలు నిత్య సత్యం అయ్యాయన్నారు. భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతి అస్తిత్వమే అన్నారు. అస్తిత్వానికి మూలం సంస్కృతి.. సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అని సీఎం వెల్లడించారు. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది తెలంగాణ తల్లి.. నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపింది తెలంగాణ తల్లి.. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదన్నారు. ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు ఇప్పటివరకు అధికారిక గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పోరాటాల ఊపిరిపోసుకున్న మాతృమూర్తిని గౌరవివించుకునేందుకు నిర్ణయించామని రేవంత్ పేర్కొన్నారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు.. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం అన్నారు. ప్రజల మనోఫలకాల్లో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విగ్రహ రూపకల్పన చేశామని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కారానికి ప్రజా ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులు పరిగణలోకి తీసుకున్నాం. ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో తెలంగాణ తల్లి రూపకల్పన చేశామన్నారు. గుండుపూసలు, హారం, ముగ్గుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు మెట్టెలతో చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూప కల్పన చేశామని చెప్పారు.
కుడి చేతితో జాతికి అభయం, ఎడమ చేతితో వరి, జొన్నలు, సజ్జ పంటలతో తెలంగాణ తల్లి విగ్రహ తయారీ జరిగిందన్నారు. తెలంగాణ సంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు రూపంతో విగ్రహ తయారీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చరిత్రకు దర్పణంగా తెలంగాణ తల్లి నిల్చొన్న విగ్రహాన్ని రూపొందించాం.. తెలంగాణ చిరునామాకు ఉద్యమాలు, ఆత్మబలిదానాలకు సంకేతంగా పీఠం పిడికళ్లను పొందుపరిచామని సీఎం వివరించారు. తెలంగాణ తల్లి నిల్చున్న ఫీఠం చరిత్రకు దర్పణంగా రూపొందించామని తెలిపారు. చేతులన్నీ కలిసి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణాన్ని తెలియజేస్తున్నాయం.. శుభం, ఐశ్వర్యం, సమృద్ధికి నిదర్శనంగా బంగారు వర్ణంతో తెలంగాణ తల్లి విగ్రహం చేయించామని సీఎం పేర్కొన్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్, కిషన్ రెడ్డి, అసదుద్దీన్ సహా కమ్యూనిస్ట్ నేతలకు ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగిందన్న ముఖ్యమంత్రి రాజకీయాలను పక్కన పెట్టి అందరూ విగ్రహావిష్కరణకు రావాలని పిలుపునిచ్చారు.