21-02-2025 05:16:45 PM
పదేళ్ల పాటు ఏ గ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇల్లు దక్కలే
ఏడు దశాబ్దాల తర్వాత పాలమూరు బిడ్డ రాష్ట్రానికి సీఎం అయిండు
పాలమూరు జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదా?
దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా.. తట్టలు మోసింది.. పాలమూరు ప్రజలే
మోడీ ఇచ్చిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో బీజేపీ నేతలు చూపించాలి
మోడీని మూడుసార్లు గెలిపిస్తే.. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేశారా?
నారాయణపేట: నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy Speech) పాల్గొని ప్రసంగించారు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభత్వం ఇచ్చిందని సీఎం గుర్తుచేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు ఇళ్ల ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పదేళ్ల పాటు ఏ గ్రామంలోనూ పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదు, ఇప్పుడు ప్రజాప్రభుత్వం మళ్లీ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందన్నారు. ఏడు దశాబ్దాల తర్వాత పాలమూరు బిడ్డ రాష్ట్రానికి సీఎం అయ్యారని తెలిపారు.
గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారు కానీ.. జిల్లాకు చేసిందేమీ లేదని ద్వజమెత్తారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా పాలమూరు జిల్లాలక న్యాయం జరగలేదని చెప్పారు. పదేళ్ల పాటు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను గత సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎంపీగా గెలిపిస్తే.. ఏనాడు పాలమూరు గురించి పార్లమెంటులో ప్రస్తావించలేదని విమర్శించారు. భీమ, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, సంగంబండం, కల్వకుర్తి ప్రాజెక్టులు పదేళ్లలో ఎందుకు పూర్తి కాలేదు.. పాలమూరు జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదా? అని సీఎం ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేసి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కావని తెలిపారు.
రాష్ట్రం వచ్చిన పదేళ్ల తర్వాత కూడా కృష్ణా జలాల్లో మనవాటా పూర్తిగా వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. తన మీద పగతో మక్తల్- నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పక్కన పడేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా.. తట్టలు మోసింది పాలమూరు జిల్లా ప్రజలేనన్న రేవంత్ రెడ్డి అన్నింటికి తట్టలు మోసిన పాలమూరు జిల్లా ప్రజలు ప్రాజెక్టులకు నోచుకోలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్, జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే నోరెత్తలేదు ఎందుకని ప్రశ్నించారు. జగన్ కు పంచభక్త పరమాన్నాలు పెట్టి తెలంగాణ జలాలను కేసీఆర్ ఏపీకీ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరుకు దక్కాల్సిన నీళ్లు జగన్ రాయలసీమకు తరలించుకుపోతుంటే చూస్తూ కూర్చున్నారని ఆరోపించారు.
పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పక్కనపెట్టి కమిషన్ల కోసం రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు.. రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుప్పకూలిందన్నారు. ప్రజాపాలనపై బీఆర్ఎస్, బీజేపీ బహిరంగ చర్చకు సిద్ధమా?.. పాలమూరు జిల్లాకు ప్రాజెక్టులు, పరిశ్రమలు వద్దా? అని ప్రశ్నించారు. మా జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను కేసీఆర్ కుటుంబం అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు. అసత్యాలు చెప్పి కొందరిని రెచ్చగొట్టి మా జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 600 బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చే అవకాశాన్ని మహిళా సంఘాలకు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో బలహీనవర్గాల లెక్కలు తీసి వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
30 ఏళ్లుగా చిక్కుముడిగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మోడీని మూడు సార్లు గెలిపిస్తే.. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేశారా? అని ప్రశ్నించారు. మోడీ ఇచ్చిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో బీజేపీ నేతలు చూపించాలని సవాల్ చేశారు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోడీ అన్నారు.. ఎవరికి ఇచ్చారో చూపాలని కోరారు. పదేళ్లలో ఏమీ చేయని వాళ్లు ఏడాదిలోనే కాంగ్రెస్ ఏమీ చేయలేదని అంటున్నారని తెలిపారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి మోసగాళ్ల మాటలు విని భూసేకరణ అడ్డుకోవద్దని పిలుపునిచ్చారు. భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.