హైదరాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రూ.వేల కోట్ల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు జవాహర్ లాల్ నెహ్రూ అని కొనియాడారు. ఇది రాజకీయ వేదిక కాదు.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం తను ఇష్ట్రం లేదన్నారు. త్యాగం అంటే ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం తనపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికి ఆయన పనితనానికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయని గుర్తు చేశారు.
నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యత తీసుకోలేదని, కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి పదవులు పొందుతారని ముఖ్యమంత్రి ఎద్దెవా చేశారు. బ్యాంకులను ప్రభుత్వపరం చేసి పేదలకు మంచి చేసిన ఇందిరా గాంధీ లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టింది కాదా..?, దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా..? ప్రతిపక్షలను ప్రశ్నించారు. దేశ ప్రజల కోసమే రాజీవ్ గాంధీ ప్రధాని పదవిని చెపట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రానికి గ్రామాలే పట్టుకొమ్మలని మహాత్మ గాంధీ అన్నారని, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్ గాంధీ అని సీఎం పేర్కొన్నారు.72, 73వ రాజ్యంగ సవరణ ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు, ఆడబిడ్డలకు రాజ్యాధికారం, దేశానికి సాంకేతికతను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని వెల్లడించారు.