సిరిసిల్ల (విజయక్రాంతి): రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేసి పూజ నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు వివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు వద్ద అర్చన, రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను ముఖ్యమంత్రి నిర్వహించారు. పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.