బీఆర్ఎస్ చెన్నూర్ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్...
మందమర్రి (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగానికి ప్రతి ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి డా. రాజా రమేష్(Dr. Raja Ramesh) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) పిలుపు మేరకు సోమవారం చెన్నూరు నియోజకవర్గం కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతులకు మద్దతు ప్రకటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎకరానికి రైతు భరోసా 15000 అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత కేబినెట్ మీటింగ్ లో చర్చించి 12,000 ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటని విమర్శించారు.
రైతు ఏడ్చిన రాష్ట్రం ఇప్పటివరకు బాగు పడలేదని రైతులకు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలని లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తే వాటికి మూడు రంగులు వేసి అవి మేము కట్టించామని చెప్పుకోవడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయాలని ఆరు గ్యారేంటీలు, 420 హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా హైడ్రా పేరుతో డ్రామాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
పరిపాలనను గాలికొదిలి కేటీఆర్ ను జైల్లో పెట్టాలని అనుకుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం భగ్గుమంటుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు తెలివి గలవారని ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నిజ స్వరూపం తెలుసుకున్నారని త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు వెన్నంటే ఉంటూ వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని కేసులకు అరెస్టులకు భయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తమది ఉద్యమపార్టీ అని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం నాయకులు, మహిళ నాయకురాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.