హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై స్పల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రైతులు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తొలిస్థానం, తెలంగాణ రెండోస్థానంలో ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో 3వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గించామని చెబుతున్నారు. అద్భుతాలు చేశామని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు అసెంబ్లీకి రాలేదని సీఎం చమత్కరించారు. అద్భుతాలు చేసినందుకు ప్రతిపక్ష నేత సభకు రాలేకపోతున్నారని రేవంత్ విమర్శించారు.
అదికారంలోకి వచ్చిన వెంటనే రూ. లక్ష రుణమాఫీ చేస్తామని 2014లో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది.. రూ. 16,100 కోట్లు రుణమాఫీ చేసింది. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు. మళ్లీ రుణమాఫీ చేస్తామని 2018లో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది.. 2019 తర్వాత బీఆర్ఎస్ రూ. 11,909 కోట్ల రుణమాఫీ చేసిందని లెక్క చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ రూ. 27 వేల కోట్ల రుణమాఫీ చేసిందని ఆరోపించారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. తొలి విడతలో రూ. లక్ష వరకు రుణమాఫీ చేశామన్నారు. జులై 18న రూ. 6,034 కోట్లతో తొలి విడత రుణమాఫీ చేశామని చెప్పారు. తొలి విడత పూర్తయిన 12 రోజుల్లో రెండో విడత రుణమాఫీ చేశామని వెల్లడించారు. పంద్రాగస్టున మూడో విడతలో రూ. 5 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం తెలిపారు. 27 రోజుల్లో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికీ రుణమాఫీ కాలేదన్న సీఎం రేవంత్ నవంబర్ 30న రూ, 2,747 కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు. ఏడాదిలోనే రూ. 20,600 కోట్ల రుణమాఫీ చేశాని ముఖ్యమంత్రి తెలిపారు.