21-04-2025 05:05:50 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రోమన్ కాథలిక్ చర్చి అధిపతి, వాటికన్ నగర సార్వభౌమాధికారి అయిన హిస్ హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ప్రపంచ అసమానతలపై పోరాటంలో పోప్ అవిశ్రాంత కృషిని ప్రశంసిస్తూ ఆయన పోప్ ఫ్రాన్సిస్ కు ఘనమైన నివాళులు అర్పించారు. ప్రపంచ శాంతిని నెలకొల్పే వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ అద్భుతమైన పాత్రను, శరణార్థులు, వలసదారులకు ఆయన తిరుగులేని మద్దతును ముఖ్యమంత్రి కొనయాడారు. పోప్ సమ్మిళిత, కరుణామయ విధానం ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని ఆయన పేర్కొన్నారు.
ఆయనను ఒక మహోన్నత ఆధ్యాత్మిక వ్యక్తిగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, పోప్ ఫ్రాన్సిస్ తన జీవితాన్ని చర్చి, మానవాళి సేవకు అంకితం చేశారని గుర్తు చేశారు. మతాంతర సామరస్యం పట్ల పోప్ నిబద్ధత, వాతావరణ మార్పులపై అవగాహన కోసం ఆయన వాదన, ప్రపంచ సంఘీభావంతో ఐక్యమైన ప్రపంచం అనే ఆయన దార్శనికతను సీఎం ప్రశంసించారు. ఆయన మృతి మానవాళికి తీరని లోటని అభివర్ణిస్తూ, పోప్ కుటుంబానికి, ప్రపంచ కాథలిక్ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.