29-03-2025 05:48:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షసమావేశం నిర్వహించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని లింక్ రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా రాకపోకలు సాగించే విధంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసి వచ్చేలా ఉండాలని, అదనపు భూసేకరణకు ఖర్చు ఎక్కువైన వెనుకాడవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.