24-03-2025 04:53:53 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికి తీసేలా చూడాలని, తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత చర్యలపై కూడా దృష్ణి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల్లో పురోగతిని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యులు, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు. నిపుణుల కమిటీ సూచనలను తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్ ముందుకు వెళ్లాలని రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.