calender_icon.png 7 April, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచ గచ్చిబౌలి భూముల కోర్టు కేసులపై సీఎం సమీక్ష

05-04-2025 08:20:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను(Hyderabad Central University Lands) లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా  కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏఐ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని, సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్‌లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారని, వాటిని నిర్మించే క్రమంలో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు వివరించారు. వాస్తవాలు వెల్లడించే లోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని,  ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా దురుద్దేశ పూర్వకంగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు ముఖ్యమంత్రి వెల్లడించారు. 

వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందన్నారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వారందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారు. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు వివరించారు. 

కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇదే తరహాలో ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే పెను ప్రమాదముంటుందని చర్చ జరిగింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్‌ను గుర్తించడానికి అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ డీజీపీ జితేందర్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.