14-02-2025 02:06:24 PM
హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(Young India Integrated Residential Schools) కు సంబంధించి నిర్ధేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ స్కూళ్లకు అవసరమైన స్థలాల సేకరణ, ఇతర పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడైతే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన చోట అనుమతులు, ఇతర పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో ముందుగా పరిశీలించాలని సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు.
ఈ స్కూళ్ల కోసం జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి త్వరగా స్థలాలను గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని, దీనిపై వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలి. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో వంద శాతం పనులు పూర్తికావాలని సీఎం పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) మహిళా విశ్వవిద్యాలయ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా పూర్తి స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.