22-04-2025 01:23:15 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. జపాన్‌లోని చారిత్రాత్మక నగరమైన హిరోషిమాలో ఉన్నప్పుడు తాను ఆ సందేశాన్ని చదివానని పేర్కొన్నారు. శాంతి, స్థితిస్థాపకత సందేశానికి పేరుగాంచిన నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించే ముందు రాహుల్ గాంధీ రాసిన లేఖను తాను చూశానని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన హృదయపూర్వక గమనికలో వెల్లడించారు. "అదృష్టవశాత్తూ నేను ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించబోతున్నప్పుడు మీ మాటలను చదివాను" అని రేవంత్ రెడ్డి రాశారు. ఆ లేఖ తనను "తీవ్రంగా కదిలించింది" అని ఆయన అభివర్ణించారు. గాంధీ సందేశాన్ని "చర్యకు స్ఫూర్తిదాయకమైన పిలుపు" అని వెల్లడించారు.
రాహుల్ గాంధీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిజ్ఞ చేస్తూ రేవంత్ రెడ్డి, తాము గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో ఆయన ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తామని అన్నారు. విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను పరిష్కరించడానికి రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయాలని రాహుల్ గాంధీ తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. కుల వివక్షపై, అంటరాని తనంపై సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను లేఖలో పేర్కొన్న రాహుల్.. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్న పేర్కొన్నారు. ఈ లేఖపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ ఏం ఆలోచించినా ప్రజల కోసమే ఆలోచిస్తారని అన్నారు. రోహిత్ చట్టం తేవాలని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) లేఖ రాశారని తెలిపారు.