30-04-2025 06:30:49 PM
కులగణన చేపట్టాలన్న కేంద్ర నిర్ణయాన్ని అభినందిస్తున్నాం: సీఎం
హైదరాబాద్: రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కుల గణన(Caste Census)ను చేర్చాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బుధవారం స్వాగతించారు. కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్ మంత్రి మంత్రుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్(Rahul Gandhi's vision) సాకారం కాబోతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారని కొనియాడారు.
దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని రేవంత్ రెడ్డి సూచించారు. రాహుల్ గాంధీ విజన్ తో రాష్ట్రంలో కులగణన చేపట్టామన్నారు. కులగణన కోసం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోరాడిందని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దిల్లీలోనూ ఆందోళన చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తుందని మరోసారి రుజువైందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం విజయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జనగణనతోపాటు కులగణన నిర్వహిస్తామనడం హర్షించదగ్గ విషయమన్నారు. రాహుల్ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టామని తెలిపారు. కేంద్రం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడితో కులగణనకు ఒప్పుకుందన్నారు.