calender_icon.png 21 December, 2024 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

21-12-2024 04:51:28 PM

హైదరాబాద్:  జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు ఆస్పత్రిలో ఉన్న బాలుడిని మాత్రం ఎందుకు పరామర్శించరు? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సంధ్య థియేటర్ ఈ నెల 2న చిక్కడపల్లి పీఎస్ లో బందోబస్తు కావాలని పోలీసులను థియేటర్ యాజమాన్యం కోరిందని సీఎం వెల్లడించారు. సంధ్యా థియేటర్ కు వెళ్లి, రావడానికి ఒకే మార్గం ఉందని చెప్పారు. సంధ్య థియేటర్ చుట్టు పక్కల ఇతర థియేటర్లు, రెస్టారెంట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.వచ్చే జనాలను నియంత్రించడం సాధ్యం కాదని చెప్పి థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖను తిరస్కరించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 2 సంధ్య థియేటర్ యాజమన్యం లేఖ ఇస్తే.. 3న తిరస్కరించామని సీఎం స్పష్టం చేశారు.

వాహనం రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ ర్యాలీ చేశారని, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ థియేటర్ కు రావొద్దని చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. థియేటర్ కు ఉన్నది ఒకే దారి.. వేలాదిమందిని నియంత్రించలేమని చెప్పారు. హీరో కారు లోపలకు పంపించేందుకు గేటు తెరిచారు. దీంతో హీరోను కలిసేందుకు వేలాదిగా ఒకేసారి థియేటర్ వైపు దూసుకొచ్చారని, ఆ సమయంలో జరిగిన తోపులాటలో రేవతి చనిపోయిందని సీఎం తెలిపారు. తోపులాటలో పిల్లవాడికి బ్రెయిన్ డెడ్ అయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని హీరోను ఏసీపీ కోరారు. మీరు వెళ్లకపోతే పీఎస్ కు తీసుకెళ్లాల్సి ఉంటుందని హీరోకు చెప్పారని తెలిపారు. పరిస్థితి బాగాలేదని చెప్పినా వాహనంపైకి ఎక్కి చేతులు ఊపారని సీఎం ఆరోపించారు. కేసు నమోదు అయ్యిందని హీరోకు పోలీసులు చెప్పారు. హీరోను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే కొందరు నేతలు తనను తిడుతూ పోస్టులు పెట్టారని ముఖ్యమంత్రి తెలిపారు.