హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వం తప్పిదాలను ప్రధాని వివరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని సీఎం స్పష్టం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు రూ. 3433 కోట్లు ఆదా చేశామని చెప్పారు. ఏడాది కాకముందే దేశంలోనే అతి పెద్ద రుణమాఫీ అమలు చేశామన్నారు. 22 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు.
కేవలం 25 రోజుల్లోనే రుణమాఫీ కింద రూ. 18 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని సీఎం వెల్లడించారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయి.. తెలంగాణలో రూ. 500కే సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 43 లక్షల మందికి సిలిండర్ పథకం ద్వారా లబ్ధి పొందారని చెప్పారు. అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం.. గ్రూప్స్ పరీక్షలను రెగ్యులర్ గా నిర్వహిస్తున్నామన్నారు. 11 నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పారు. నియామకాల్లో ఏ బీజేపీపాలిత రాష్ట్రంతో పోల్చినా తమదే రికార్డు అన్నారు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను 40 శాతానికి పైగా పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.