హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వివరాలు నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్, అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ వివరాల సేకరణలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని సీఎం అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీలయినంత త్వరగా కులసర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.