హైదరాబాద్,(విజయక్రాంతి): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా హజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఇందుకోసం మహేంద్రా, టాటా కంపెనీలతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. తాము చేసే ప్రతి పని రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వ్యవసాయం అనేది దండగ కాదు.. పండగ అనేది తమ విధానం అన్నారు. రూ.18 వేల కోట్ల నిధులు విడుదల చేసి రైతుల రుణాలు మాఫీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పీ.వీ. నరసింహారావు కృషి చేసి ప్రపంచంతో పోటీ పడేలా ఆర్థిక విధానాలు తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి కొనియాడారు. విధాన రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద న్నారు. కొవిడ్ కు వ్యాక్సిన్ తయారీలో కూడా తెలంగాణ రాష్ట్రం ముందుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.