calender_icon.png 17 October, 2024 | 7:45 PM

మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం

17-10-2024 05:27:39 PM

కాంగ్రెస్ ప్రధానుల వల్లే దేశం ముందుకెళ్లింది

ముసుగులో రాష్ట్రాన్ని దోచుకున్నారు

మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనం

మూసీ ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన

చెరువులు, నాలాలు కబ్జా.. పెరిగిన ముంపు సమస్య

హైదరాబాద్: మూసీకి పునరుజ్జీవనం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.  రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. 33 బృందాలు మూసీ పరివాహకంపై అధ్యయనం చేశాయని చెప్పారు. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. దుర్భర పరిస్థితుల్లో ఉన్న వారికి మెరుగైన జీవితం అందించాలని తాము భావిస్తున్నామని తెలిపారు. విద్యావంతుల నుంచి నిరక్షరాస్యుల వరకు అందిరికీ హైదరాబాద్ ఉపాధి కల్పించాలన్నారు. గత ప్రధానులు పంచవర్ష ప్రణాళికలు చేపట్టి క్రమబద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. తిండికి అలమటించిన భారత దేశం ఇవాళ ఆహారోత్పత్తిలో మిగులు సాధించామన్నారు. దేశానికి సాంకేతిక, ఐటీ విప్లవం తీసుకువచ్చిందని రాజీవ్ గాంధీ అన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు ఐటీ కంపెనీలకు భారతీయులనే నియమించుకుంటున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రధానులు అమలు చేసిన సంస్కరణలతో దేశం ఎంతో ముందుకెళ్లిందన్నారు.

నెహ్రూ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు ఎన్నో సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. గత ప్రధానులు సంస్కరణలు తెచ్చిన ప్రతిసారీ కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిందని వెల్లడించారు. సంస్కరణలు వ్యతిరేకించే వర్గం ఎప్పుడూ ఉంటుందన్నారు. భూగరిష్ఠ పరిమితి చట్టాన్ని వ్యతిరేకించిన వర్గం కూడా దేశంలో ఉండేదని సీఎం పేర్కొన్నారు. పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలని దొరలు, భూస్వాములు భావిస్తారని చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, మంత్రుల ముసుగులో రాష్ట్రాన్ని దోచుకున్నారని వ్యాఖ్యానించారు. మేము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనం అన్నారు. కొందు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదడులో విషం నింపుకుని మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన అన్నారు. మల్లన్న సాగర్, వేములఘాట్ లో ఏం జరిగిందో గుర్తుతెచ్చుకోవాలని సీఎం సూచించారు.

రాత్రికి రాత్రే పోలీసులతో కొట్టించి, గుర్రాలతో తొక్కించి మేం ఖాళీ చేయించటం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ.. ఇలా ఎక్కడికైనా నేను వస్తానని ఆయన సవాల్ విసిరారు. ముసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టామని సీఎం రేవంత్ వివరించారు. నగరం మధ్య గుండా నది వెళ్తున్న రాజధాని మరొకటి దేశంలో లేదు.. దాదాపు 300 కి.మీ ప్రవహించే మూసీకి ఎంతో చరిత్ర, విశిష్టత ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేడు మూసీ నది కాలుష్యానికి ప్రతీకగా మారిందన్నారు. 1600కు పైగా నివాసాలు పూర్తిగా మూసీనది గర్భంలో ఉన్నాయని చెప్పారు. మల్లన్న సాగర్ లో మునిగిపోయిన 14 గ్రామాల్లో ఎలా వ్యవహరించారో తెలుసా? అని ప్రశ్నించారు. తాము ఉన్నపళంగా, నిర్ణయగా ఎవరినీ ఖాళీ చేయించలేదని సూచించారు. నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించి, రూ. 25 వేలు ఇచ్చామన్నారు.

చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలనే హైడ్రా కూల్చిందే తప్ప.. మూసీ పరివాహకంలో ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, ఇప్పటికే కబ్జాకు గురై ముంపు సమస్య పెరిగిందన్న సీఎం ఇటీవల వరదల్లో ముంబయి, బెంగళూరు, చెన్నై, విజయవాడలో ఏం జరిగిందో చూశారని చెప్పారు. చినుకు పడితే చాలు హైదరాబాద్ లో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్లపై పడిన వర్షపునీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా.. అలాగే రూడ్లపై ఉండాలా? అని సీఎం ప్రశ్నించారు. వరదలు వచ్చి నగరం మునిగిపోతే అప్పటికప్పుడు ఏమైనా చేయగలుగుతామా? అని ప్రశ్నించారు. విషతుల్యమైన మూసీ జలాలతో నల్గొండ ప్రజలు ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీనది జాలాలతో పండుతున్న పంటలు ప్రమాదకరంగా ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయని తెలిపారు. మూసీ పునరుజ్జీవనం కోసం 5 కన్సల్టెన్సీ సంస్థలు పని చేస్తున్నాయి. ఈ కన్సల్టెన్సీ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్నది కేవలం రూ. 141 కోట్లు అన్నారు. రూ. 141 కోట్ల ప్రాజెక్టును రూ. లక్షన్నర కోట్లు అంటూ.. దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.