హైదరాబాద్,(విజయక్రాంతి): గత ప్రభుత్వ నేతలు ఇక్కడ సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్మునే విదేశి పెట్టుబడులుగా చూపారని, తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాల సాధన పెద్దదని రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మేం భారీ పెట్టుబడులు(Investments) తేవడం చూసి కొందరికి కడుపుమంటగా ఉందన్నారు. మేం వెళ్లినప్పుడు ఇంతస్థాయిలో పెట్టుబడులు రాలేదని అక్కసుతో ఉన్నారని, ప్రతిపక్షలు చేసే ఆరోపణలతో తాము ఎక్కడైనా విఫలం అవుతామేమోనని ఆశపడ్డారు.
ప్రతిపక్షంలోని ఒక నేత అటెన్షన్ డిజార్డర్ తో బాధపడుతున్నారని, చాలా సంస్థలు తెలంగాణ పెవిలియన్ కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రభుత్వం తెచ్చిన ఎనర్జీ పాలసీతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని, అనుమతుల్లో సరళీకరణ వల్లనే పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చైనాకు ప్రత్యామ్నాయమైన దేశాన్ని ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయని, అనుకూల వాతావరణం ఉన్న నగరాల వైపే అంతర్జాతీయ సంస్థలు చూస్తాయని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు దావోస్ వెళ్లామని, ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని సీఎం తెలిపారు. రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను దావోస్ సదస్సులో ఆకర్షించామని, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీ కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దీంతో యువతలో సాంకేతిక నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సూచించారు. గతేడాది పర్యటనలో రూ.40 వేల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు జరిగయన్నారు.