18-04-2025 02:55:44 PM
హైదరాబాద్: సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు(Osmania General Hospital Doctors) సాధించిన అద్భుతమైన విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy praises) ప్రశంసించారు. ఎక్స్ వేదికగా వార్త క్లిప్పింగ్‌ను పంచుకున్న పోస్ట్‌లో "నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అన్న నానుడిని తిరగ రాసి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేసి నిరూపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలోని వైద్యులు, సిబ్బందికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచినందుకు డాక్టర్ రంగ అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందానికి ప్రత్యేక అభినందనలు." అంటూ సీఎం ఎక్స్ లో పోస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు(Visakhapatnam) చెందిన 22 ఏళ్ల హేమంత్ అనే రోగి షిర్డీకి ప్రయాణిస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేరాడు. ప్రారంభంలో, అతని కుటుంబం అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ కేసు సంక్లిష్టత కారణంగా ఆసుపత్రి అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించింది. సిబ్బంది లభ్యత సాధారణంగా పరిమితంగా ఉండే సెలవు దినం అయినప్పటికీ, అతన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి(Osmania General Hospital)కి తరలించారు. జనరల్ సర్జరీ విభాగం పరీక్షలు నిర్వహించింది. అల్ట్రాసౌండ్ పేగు చిల్లులు ఉన్నట్లు వెల్లడించింది. ప్రొఫెసర్ డాక్టర్ రంగ అజ్మీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమ్ పర్యవేక్షణలో, బృందం విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించింది. హేమంత్‌ను పది రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ సమయంలో అతను స్థిరంగా కోలుకున్నాడు. వైద్యులు తెలిపిన ప్రకారం, ఏప్రిల్ 17, గురువారం ఆయనను డిశ్చార్జ్ చేశారు.