మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలిని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
మన్మోహన్ సింగ్.. దేశానికి విశిష్ట సేవలందించారు.
మన్మోహన్ సింగ్ దేశానికి మార్గదర్శి
హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. తెలంగాణకు ఆత్మబందువు, తెలంగాణ సమాజం.. మన్మోహన్ సింగ్ ను గుండెల్లో పెట్టుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు మన్మోహన్ సింగ్(Manmohan Singh ) అన్నారు. తెలంగాణ బిల్లులను 2 సభల్లో పాస్ చేయించిన సారథి.. మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. శాసన సభలో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించి సంతాప తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్, మన్మోహన్ సింగ్.. దేశానికి విశిష్ట సేవలు అందించారన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్(RBI Governor) గా పనిచేశారని పేర్కొన్నారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారన్న ఆయన కేంద్ర ఆర్థికమంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ దేశానికి సేవలందించారని కొనియాడారు.
1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారని తెలిపారు. సామాజిక విప్లవ కార్యక్రమైన ఆధార్(Aadhaar) ను మన్మోహన్ సింగ్ ప్రారంభించారని తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ఆర్థిక స్థతిగతులను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఎల్ పీజీ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపారని చెప్పారు. 2004-14 మధ్య ప్రధానిగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధి హామీ, ఆర్బీఐ, ఎన్ హెచ్ఆర్ఎంను మన్మహన్ సింగ్ ప్రారంభించారని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం, మహబూబ్ నగర్(Anantapur, Mahabubnagar) నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు. ఆర్థిక రంగంలో మన్మోహన్ సింగ్ దేశానికి మార్గదర్శి.. భావితరాలకు మన్మోహన్ ఆదర్శ నాయకుడన్నారు. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మాణం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సరళీకృత ఆర్థిక విధానాలను తెచ్చి ప్రపంచంలో పోటీపడేలా పునాది వేశారని చెప్పారు. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేత.. మన్మోహన్ సింగ్, జీవితాన్ని దేశానికి అంకింతం చేసిన గొప్ప వ్యక్తి.. మన్మోహన్ సింగ్ అని సూచించారు. మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానిగా ఉన్నా నిరాడంబరంగా జీవించారని కొనియాడారు. 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలకు న్యాయం జరిగేలా చూశారని చెప్పారు. 2006లో అటవీహక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని వెల్లడించారు. ఐటీ రంగంలో శాసించగలుగుతున్నామంటే మన్మోహన్ విధానలే కారణం అన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు.