హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్థంతి కార్యక్రమాన్ని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రోశయ్య వల్లే రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ట్రబుల్ షూటర్ గా రోశయ్య కీలక పాత్ర పోషించడం వల్లే ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ధీమాగా ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో సీఎం ఎవరున్నా.. నంబర్ 2 స్థానం మాత్రం రోశయ్యదేనన్నారు. నంబర్ 1ను పక్కకు జరపాలని నంబర్ 2 రోశయ్య ఎప్పుడూ భావించలేదని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే రోశయ్య నంబర్ 1 అయ్యారని కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలోనే ఉంది, రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ఆర్యవైశ్యులు మరింత సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచిన రోశయ్య విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తామని సీఎం పేర్కొన్నారు. రోశయ్య తన ఛాంబర్ కు పిలిపించుకుని విలువైన సూచనలు చేశారని, ప్రతిపక్షం తప్పక ప్రశ్నించాలి, పాలకపక్షం పరిష్కరించాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలకు మేలు కలిగేలా పాలకపక్షాన్ని నిలదీయాలని రోశయ్య చెప్పారని సీఎం రేవంత్ వెల్లడించారు. తమిళనాడు గవర్నర్ గా ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేశారని చెప్పారు.