30-03-2025 08:49:47 PM
హుజూర్ నగర్,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం పర్యటించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హుజూర్ నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి (Civil Supplies Minister Uttam Kumar Reddy)ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఒకప్పుడు శ్రీమంతులు తినే సన్నబియ్యన్ని పేదలు తినే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ఉగాది పర్వదినన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని(Sanna Biyyam Scheme) ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. నల్గొండ జిల్లా ప్రజలకు గొప్ప చరిత్ర ఉందని, భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటాలు చేసిన గడ్డ అని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలు రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో ప్రాణాలు అర్పించారని, రావినారాయణ రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్జీతో లోక్ సభకు పంపించారన్నారు. పేదలకు 25 లక్షల ఎకరాలను అసైన్డ్ భూములుగా పంచిన చరిత్ర ఇండిరాగాంధీ సొంతం అని, పేద ప్రజలకు రూ.1.90కే కిలో బియ్యం ఇవ్వాలని మొదట కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి భావించారని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో రూ.2 లకు కిలో బియ్యం పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారని కొనియడ్డారు.
పేదలకు బియ్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ 1957 లోనే రేషన్ దుకాణాలను ప్రారంభించిందన్నారు. దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే జిల్లాల్లో నల్గొండ జిల్లా ఒకటన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు సన్నబియ్యం ఇస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఉచితంగా ఇచ్చిన సన్నబియ్యాన్ని ప్రజలు రూ.10లకే అమ్ముకుంటున్న రేషన్ బియ్యాన్ని మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ రూ.50 కి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల నుంచి రేషన్ బియ్యాన్ని కొన్న మిల్లర్లు కోట్ల రూపాయాల దందా చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరగవడంతో రాష్ట్ర ప్రజలు సన్నబియ్యానికి మొగ్గు చూపుతున్నారని, అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ రాలేదని విమర్శించారు. గత సీఎం వరి వేస్తే.. ఉరే.. అని ప్రజలు వరి పండించకుండా బెదిరించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సన్నబియ్యంపై క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 12 లక్షల టన్నుల సన్నవడ్లు పండితే నల్గొండ ప్రజలే 8 లక్షల టన్నులు పండిస్తున్నారని స్పష్టం చేశారు.
రోటీ.. కపడా.. ఔర్ మకాస్ నినాదంతో పేదరికాన్ని పారదోలేందుకు ఇందిరా గాంధి కృషి చేశారు. సన్నబియ్యం పథకాన్ని భవిష్యత్ లో ఎవరూ రద్దు చేసే సాహసం కూడా చేయరని, ప్రభుత్వాలు మారిన కూడా సన్నబియ్యం పథకం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పూర్తి చేయలేదని, నల్గొండ జిల్లాపై పగతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ను కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శించారు. ఏడాదికొక కిలో మీటర్ తవ్వినా.. ఈపాటికే ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి అయ్యేదని, మూడేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే.. అది మూడేళ్లకే కూలిందని, ప్రపంచంలో ఏడో వింత అని చెప్పుకున్న కాళేశ్వరం కాస్త.. కూలేశ్వరం అయ్యిందనిఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రారంభించుకున్న సన్నబియ్యం పథకంతో రాష్ట్రంలోని 3.10 కోట్ల మందికి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేహ్ కుమార్ గౌడ్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు.