02-03-2025 05:24:29 PM
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి(Wanaparthy ) జిల్లాలో ప్రజాపాలన ప్రగతిబాట సభ(Praja Palana Pragathi Bata Sabha) ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, చిన్నారెడ్డి, పార్టీ నాయకులు హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతిబాట సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తాను రాజకీయాల్లో రాణించడంతో వనపర్తి పాత్ర ఉందన్నారు. వనపర్తి తనకు చదువుతోపాటు సంస్కారం నేర్పిందని, వనపర్తి ప్రజలతో తన బంధం పెనవేసుకున్న బంధమన్నారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా వనపర్తిని మరిచిపోలేనని, వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు వన్నెతెచ్చాడనే కీర్తి తీసుకొస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంత రాజకీయాల్లో కక్షలు, ధన ప్రభావం ఉండేది కాదని, ఐదేళ్ల క్రితం వనపర్తి నుంచి ఎన్నికైన వ్యక్తి రాజకీయాలను కలుషితం చేశారని ఆరోపించారు. వనపర్తికి రాష్ట్రంలోనే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ జరిగిందా లేదా..?, రైతు భరోసా నిధులు మీ ఖాతాల్లో వేశామా.. లేదా..? అని అడిగారు. బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండడని సూచించారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా ఎక్కడైనా కోతలు విధించామా..?, రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామా..? లేదా..? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి మరో 15-20 ఏళ్లు సీఎంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్, బీజేపీ నేతల బతుకులు బస్టాండ్ అవుతాయని వారి భయం అని అభిప్రాయపడ్డారు. స్వయం సహాయక సంఘాల్లో 65 లక్షల మంది మహిళలు ఉన్న సంఖ్య కోటికి చేర్చాలని ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.