calender_icon.png 24 February, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు తిరస్కరించినా.. కేసీఆర్‌లో మార్పు రాలేదు

24-02-2025 02:43:06 PM

ఫామ్ హౌజ్ లో కూర్చుని కేసీఆర్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తుండు

వందేళ్ల బీసీల సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం

దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్ చేసింది

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు

హైదరాబాద్: కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అవసరం తెలంగాణ రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని, చేసింది చాలు ఇక ఫామ్ హౌజ్ లో విశ్రాంతి తీసుకోమ్మని కేసీఆర్ కు ప్రజలు చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సోమవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. ప్రజలు తిరస్కరించినా.. కేసీఆర్ లో మార్పు రాలేదు, ఫామ్ హౌజ్ లో కూర్చొని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలక పాత్ర అని సీఎం వెల్లడించారు. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇవ్వాళ మమ్మల్ని తప్పు పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏడాదిలోనే తాము ఏమీ చేయలేదని దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. పదేళ్ల పాటు నోటిఫికేషన్లు వేయలేదు.. వేసిన వాటి మీద వాళ్లే కేసులు వేశారని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(Bharat Rashtra Samithi) పదేళ్ల పాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించామన్నారు. చదువుతున్న యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చామన్నారు. రాష్ట్ర యువతలో అత్యాధునిక నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర యువత క్రీడల్లో రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి రూ,2 కోట్ల ప్రోత్సాహక నగదు ఇచ్చామని సీఎం గుర్తుచేశారు.

క్రికెటర్ సిరాజ్ కు ఎన్నో మినహాయింపులు ఇస్తూ గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామన్నారు. పారా అథ్లెట్, వరంగల్ బిడ్డ జివాంజీ దీప్తికి ఇంటి స్థలం, రూ. 25 లక్షలు ఇచ్చామని పేర్కొన్నారు. 26.50 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశాం, మీకు రుణమాఫీ చేసింది నిజమైతే.. సన్నవడ్లకు రూ. 500 బోనస్ వచ్చి ఉంటే.. కాంగ్రెస్ కు ఓటు వేయండని కోరారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను కేసీఆర్ రూ. 7 లక్షల కోట్లు అప్పల కుప్పగా చేశారని ద్వజమెత్తారు. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతినెల రూ. 600 కోట్లు ఏడాదికి రూ. 75 వేల కోట్లు చెల్లిస్తున్నామని లెక్కచెప్పారు. కేసీఆర్ పాలనలో ఏనాడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు రాలేదు.. ఉద్యోగులు రిటైర్డ్ అయితే వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిటైర్డ్ ఉద్యోగులకు కేసీఆర్ రూ. 8 వేల కోట్లు బకాయి పెట్టి పోయారని తెలిపారు. దేశంలో ఎవరు చేయని సాహసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని సీఎం వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేశామన్నారు. వందేళ్లుగా ఎన్నడూ జరగని కులగణనను సమర్థంగా నిర్వహించామని తెలిపారు. కులగణనపై బీజేపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏనాడు జనగణన, కులగణన చేయని బీజేపీ సర్కార్ తమ లెక్కలు తప్పని ఎలా అంటుందన్నారు. వందేళ్ల బీసీల సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపుతోందన్నారు. వర్గీకరణ కోసం ఎస్సీలు 30 ఏళ్లు పోరాటం చేశారు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేశామన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్ ను బీజేపీ కాపాడుతోందని సీఎం ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతును బీజేపీ తీసుకుంటోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు తప్పదని బెదిరించారని వెల్లడించారు. అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును కేంద్రం ఎందుకు రప్పించటం లేదని ప్రశ్నించారు. రెడ్ కార్నార్ నోటీసు జారీ చేయాలనని కేంద్రాన్ని కోరితే ఎందుకు పక్కకు పెట్టారనని ప్రశ్నించారు. ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ  చేయటం లేదు, పదేళ్లలో ఎంతో మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ లో చేర్చుకని మంత్రిని  చేయలేదా?, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. పదేళ్లలో ఎన్నడూ రాని ఉపఎన్నికలు ఇప్పుడే ఎందుకు వస్తాయన్నారు. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగకుండా బీజేపీ కేంద్రమంత్రులు దిల్లీలో అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం పనులు ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. గుజరాత్ లో సమర్మతి నది పునరుజ్జీవాన్ని సమర్థించిన వాళ్లు హైదరాబాద్ లో మూసీకి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.