హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహదారులు పాల్గొన్నారు. రైతును అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకే రుణమాఫీ పథకం తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంత భారమైనా ఏకకాలంలో రుణమాఫీ ఘనత కాంగ్రెస్ దే అని, ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని సీఎం అన్నారు.
సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చాని, తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండని చెప్పారు. ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదని, మీ ప్రతి చర్య ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలని సీఎం హితవు చేశారు.
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అని, ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.85 వేలు ఖర్చు పెడుతోందని రేవంత్ తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యావ్యవస్థ అత్యంత కీలకమన్నారు. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్చలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.