calender_icon.png 4 March, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోంది: మంత్రి ఉత్తమ్

03-03-2025 05:20:55 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కృష్ణాజలాలు, పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై చర్చించారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ఏపీ కేటాయించిన జలాలకంటే ఎక్కువగా వాడుతోందని, ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రానికి కోరామన్నారు. ఏపీ చేపడుతున్న బనకచర్లపై తమ అభ్యంతరం చెప్పామని, గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదు.

తెలంగాణ రాష్ట్రానికి జలాల కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్తోందో అర్థం కావడంలేదన్నారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఎలాంటి డీపీఆర్ ఇవ్వలేదని కేంద్రమంత్రి చెప్పారని వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయింపుల పెంపుపైనా చర్చించామని, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడిగినట్లు వెల్లడించారు. మొత్తం ఐదు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరామని, ఉమ్మడి ప్రాజెక్టులపై టెలిమెట్రీలను త్వరగా ఏర్పాటు చేయాలని అడిగామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టెలిమెట్రీల ఏర్పాటుకు అవసరమైతే ఏపీ వాటా భరిస్తామని చెప్పామన్నారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇస్తేనే తాము చర్యలు చేపడతామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు ఉత్తమ్ చెప్పారు.