హైదరాబాద్: బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాలీవుడ్ పెద్దలతో ప్రభుత్వ చర్చలు ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు సమావేశమైయ్యారు. సినీ ప్రముఖులతో భేటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు. ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశం జరుగుతోంది. ఇప్పటికే సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ భేటీలో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు.
ఈ భేటీకి అల్లు అరవింద్, సురేశ్ బాబు, మైత్రి రవి, నవీన్, నాగవంశీ, సి. కళ్యాణ్, గోపీ ఆచంట, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్.నారాయణ, రాఘవేంద్రరావు, మురళీ మెహన్ తదితరులు హాజరయ్యారు. సినిమా టికెట్ ధరల పెంపు, బినిఫిట్ షో, గద్దర్ అవార్డులు, ముందస్తు ప్రదర్శనల విషయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడడం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు, లఘు చిత్రాల రూపకల్పనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.