హైదరాబాద్: పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... తెలంగాణ బడ్జెట్ లో విద్యకు రూ.21 వేల కోట్లు కేటాయించామన్నారు. 36 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు, 10 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. విద్యావ్యవస్థలో ఎక్కడో లోపం ఉందన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి ఉన్న లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పదేళ్లుగా టీచర్లకు ఏనాడు ఒకటో తేదీన జీతాలు పడలేదన్నారు.
యజమాని మీద విశ్వాసం ఉన్నప్పుడే ఉద్యోగి నిజాయితీగా పని చేస్తాడు, గత యజమాని కేసీఆర్ పై ఉపాధ్యాయులకు ఎప్పూడూ విశ్వాసం లేదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడానికి ఎవరైనా వస్తే వెంటనే స్పందించానని తెలిపారు. టీచర్లు తేనెటీగల్లా వారి పని వారు చూసుకుంటారన్నారు.. ఎవరైనా టీచర్ల జోలికి వస్తే కలిసికట్టుగా దాడి చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. టీచర్ల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 30 వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతులు ఇచ్చామన్నారు. మంత్రులు, అధికారులు.. టీచర్లకు అందుబాటులో ఉండాలని చెప్పానన్నారు. ప్రతినెల ఒకటో తేదీన మీ ఖాతాలో జీతం పడేలా చూసే బాధ్యత తనదన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు.. ఏమీ ఆశించలేదని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో లేదు.. మీ చేతుల్లో ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.