కాంగ్రెస్ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదు
తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పారు.. ఇచ్చారు
పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని కాదు
నారాయణపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నాలుగు సంక్షేమ పథకాలను ఆదివారం ప్రారంభించారు. నాలుగు పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉన్నాయి. 734 మంది అబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి రైతుభరోసా చెక్కులు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ. 11.80 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొకటిగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఎంతో మంది పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి రైతు కూలీలు ప్రభుత్వ అండ కోరుకుంటున్నారని తెలిపారు. రైతుభరోసాతో ఏడాదికి రూ. 12 వేలు ఇస్తున్నాం. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
భూమి.. విత్తనానికి ఉన్న అనుబంధం..రైతుకు కాంగ్రెస్ కు మధ్య ఉంది.
భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్ కు మధ్య ఉందన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ను మొదట అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం గుర్తుచేశారు. దేశమంతట రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారని తెలిపారు.రైతులకు ఒకే విడతలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. ఒకే విడతలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని తేల్చిచెప్పారు. 25.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 21 వేల కోట్లు వేశామని తెలిపారు. సాగు ఖర్చలు పెరిగాయని రైతుభరోసా నిధులు పెంచామన్నారు.
ఏడాదికి ఎకరాకు రూ. 12 వేలు చొప్పున రైతుభరోసా(Rythu Bharosa ) ఇస్తున్నామని చెప్పారు. ఇవాళ ఆదివారం కాబట్టి రైతుభరోసా డబ్బులు జమకావన్న సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. భూమిలేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని, భూమి లేని పేదలకు ఆదుకునేందుకు రైతుభరోసా తీసుకువచ్చామని చెప్పారు. కూలీ పని చేసే పేదలకు రైతుభరోసా కింద రూ. 12 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. గడిచిన పదేళ్లలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లలో గ్రామాల్లో ఎవరికైనా రెండు పడకగదులు ఇల్లు వచ్చిందా? అని సీఎం ప్రశ్నించారు. పేదల ఇల్లు నిర్మించుకుంటే రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలే..
గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులు(Ration cards) ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామని సూచించారు. గ్రామసభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపిన రేవంత్ రెడ్డి గ్రామసభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఏదైనా కావాలంటే ఎవరైనా ఫామ్ హౌజ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండే.. ఇప్పుడు ప్రజల దగ్గరకే ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారని వివరించారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోందన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదు..
కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదన్నారు.. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ(Sonia Gandhi ) చెప్పారు.. ఇచ్చారు అని రేవంత్ గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉండి.. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదని సీఎం ఆరోపించారు. రూ. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిందని విమర్శించారు. కాళేశ్వరం కూలిపోయినా.. ఈ ఏడాది సాగువిస్తీర్ణం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు సభకు దుస్థితిని ఏమనాలి.. ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వర్తించనప్పుడు ఆ పదవి ఎందుకు? అని ప్రశ్నించారు. మనం ఎన్నుకున్న సర్పంచ్ గ్రామంలో లేకుంటే ఎలా ఉంటుంది. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే.. ప్రజలను రెచ్చగొడుతున్నారు. మన ప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమలు తేవాలని భావించాను. మాయమాటలు చెప్పి ప్రజలు రెచ్చగొట్టి పరిశ్రమలను అడ్డుకున్నారని సీఎం ద్వజమెత్తారు.
నా సోదరులు ప్రజాసేవ చేస్తుంటే.. ఏం పదవి ఉందంటున్నారు..
నా సోదరులు ప్రజాసేవ చేస్తుంటే.. ఏం పదవి ఉందని అంటున్నారు.. కేసీఆర్ కుటుంబం(KCR family) వలే మా ఇంట్లో అందరూ పదవులు పొందలేదని ఆరోపించారు. సోదరులు, బంధువులు అందరికీ పదవులు ఇస్తేనే.. మంచిదా? అని ప్రశ్నించారు. కుటుంబమంతటికీ పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని కాదని సీఎం తేల్చిచెప్పారు. కుమారులు, కుమార్తె, అల్లుడు, బంధువులకు కేసీఆర్ పదవులు ఇచ్చారు. కేసీఆర్ కుమార్తె ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ చేశారని విమర్శించారు. పేదలంతా ఎక్కడ ఉన్నా.. రేషన్ కార్డు తీసుకోవాలని సూచించారు. రేషన్ కార్డులపై త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్నారు. దావోస్ వెళ్లి ఏ సీఎం కు సాధ్యం కానంత పెట్టుబడులు తెచ్చానని చెప్పిన సీఎం రేవంత్ ప్రజలు అండగా నిలిస్తే తెలంగాణ(Telangana) రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.