calender_icon.png 17 March, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకు పరిపాలనపై పట్ట రాలేదంటా..!: సీఎం రేవంత్ రెడ్డి

17-03-2025 06:21:53 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలో భాగంగా సోమవారం రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూ.4 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తుంది. రాజీవ్ యువ వికాసానికి నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారులను ఎంపిక  చేసి యూనిట్లు మంజూరు చేయనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తొలి ఏడాదిలోనే 54 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. 

రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, త్వరలోనే స్వయం సహాయక సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు ఏడాదికి రెండు చీరల చోపున 1.20 కోట్ల చీరలను పంపిణీ చేయనున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలకే పాఠశాలల నిర్వహణ బాధ్యత ఇస్తున్నామని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటివరకు దేశంలో కులగణన జరగలేదని ఆయన వెల్లడించారు. సమాజానికి ఎక్స్ రే వంటి కులగణన దేశమంతా జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇవాళ తెలంగాణ శాసన సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టామని వివరించారు. ఎస్సీల వర్గీకరణ కోసం గత 35 ఏళ్లుగా ఉద్యమం సాగుతోందని,  దశాబ్దాలుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టామన్నారు. అబద్ధాల పునాదుల మీద తాము ప్రభుత్వాన్ని నడపలేమని సీఎం మండిపడ్డారు. 

గత ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారాకు పాల్పడిందని ఆరోపించారు. ఒక్క ఇసుక విక్రయంలోనే రోజువారీ ఆదాయం రూ.3 కోట్లు పెరిగిందని, జీఎస్టీ వసూళ్లలో 17 శాతం పెరుగుదల నమోదైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  తనకు పరిపాలనపై పట్టురాలేదని కొందరు అంటున్నారని, మంత్రివర్గం నుంచి మంత్రులను, అధికారులను తొలగించి, బదిలీలు చేస్తేనే పాలనపై పట్టు ఉన్నట్లా..? అని ప్రశ్నించారు. అన్నింటిని సవ్యంగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లడమే నా విధానమన్నారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారమని చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని మా ఎమ్మెల్యేలకు చెప్తుంటాను అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల విషయంలో మాత్రం పార్టీలను చూడకుండా అసలైన అర్హులకు పథకాలను తప్పక వర్తింపచేయాలని అధికారులను చెప్తుంటానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వారి జనాభా మేరకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.