calender_icon.png 16 March, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం: సీఎం రేవంత్

15-03-2025 08:00:09 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళ్లేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని, బీఆర్ఎస్ కట్టింది కాళేశ్వరం కాదని.. కూలేశ్వరం అని ప్రజలే అంటున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే ఇప్పటికీ రైతులకు సాగునీరు అందిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మహిళలు ఎక్కడికైనా వెళ్లేలా ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించామని, మహిళ సాధికారత కోసం ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఉచిత విద్యుత్ కోసం ఇప్పటికే రూ.1,775 కోట్లు ఖర్చు ఖర్చు చేశామన్నారు. రూ.1200కు పెరిగిన గ్యాస్ సిలిండర్ ను రూ.500కే ఇస్తూ మహిళలపై ఆర్థిక భారం తగ్గించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకప్పుడు టీజీఆర్టీసీలో అద్దె బస్సులు బడా వ్యాపారులకు చెందినవి మాత్రమే ఉండేవని, ఈ ప్రభుత్వం మహిళా సంఘాలతో వెయ్యి ఆర్టీసీ బస్సులను కొనిపించి, ఆ బస్సులనే ఇప్పుడు అద్దెకు నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లు నడిపే శక్తి మహిళలకు ఇస్తున్నామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక్క మహిళకు కూడా తన మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు.

రాష్ట్ర యువతలో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు చేపట్టామని, విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకే యంగ్ ఇండియా యూనివర్సిటీ స్థాపించామని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను యంగ్ ఇండియా యూనివర్సిటీలో బోర్డు సభ్యులుగా చేశామని, కంపెనీల అవసరాలకు అవసరమైన స్కిల్స్ యువత పొందేలా కరికులం ఏర్పాటు చేశామని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 శాతం వడ్డీకి రూ.8.19 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి పోయిందని, పాత అప్పులు చెల్లించేందుకే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.53 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించిందని, గుత్తేదారులకే రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయారని మండిపడ్డారు.

తాము ఎంతో బేరసారాలు చేసి వడ్డీ శాతాన్ని కూడా తగ్గించామన్నారు. దేశంలోని రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దన్న వంటివారే అని, తను ప్రధానిని పెద్దన్న అని సంబోధిస్తే.. ప్రతిపక్ష నేతలు తప్పు పట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చినజీయర్ స్వామి పాదాల వద్ద తాకట్టు పెట్టారని, తెలంగాణ సంస్కృతి పట్ల గత ప్రభుత్వానికి గౌరవం లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆనంద్ సాయిని యాదాద్రి పనుల్లో భాగం చేసి వందల కోట్లు ఇచ్చారని, మన రాష్ట్రంతో సంబంధంలేని వారికి అన్నింటిలో భాగస్వామ్యం కల్పించారని, తెలంగాణ కోసం పోరాడిన వారిని ఎవరినైనా గౌరవించారా..? అని విరుచుకుపడ్డారు.