భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కులగణన నిర్వహించి దేశ చరిత్రలో బీసీలను గుర్తించడమే కాకుండా వారికి రాజ్యాదికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్ అన్నారు. బీసీలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా అడుగులేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యసాధకుడని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వడ్డేర సంఘం కార్యాలయంలో అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో గుంజ శ్రీనివాస్ మాట్లాడుతూ... గత సీఎం కేసీఆర్ సామాజిక అన్యాయానికి పాల్పడగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా వర్గాల సాధికారత కోసం నిబద్దతతో అడుగులేస్తున్నారని అభినందించారు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా బీసీ కులగణన చేపట్టి దశాబ్ధాల కాలంగా వెనకబాటుకు గురైన వెనకబడిన తరగతుల అభివృద్దికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవడమే కాకుండా న్యాయస్థానాల్లో చట్టపరమైన చిక్కులు ఎదురైతే ప్రస్తుతానికి పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు ప్రకటిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించడం, బీసీ సామాజిక వర్గాల వారి వారి జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.