27-03-2025 01:55:37 PM
హైదరాబాద్: లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శాసనసభలో గురువారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ (Delimitation)కు వ్యతిరేకంగా సీఎం పెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... డీలిమిటేషన్ పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని సీఎం సూచించారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. అసెంబ్లీ నియోజకవర్గాలను 153 పెంచాలని తెలిపారు.
ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ను 25 ఏళ్లు నిలిపివేశారని గుర్తుచేశారు. డీలిమిటేషన్ పై గందరగోళం నెలకుందని సీఎం చెప్పారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Tamil Nadu CM Stalin) డీలిమిటేషన్ పై సమావేశం ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని తీర్మానం చేశారన్నారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అటల్ బిహారీ వాజ్ పేయీ కూడా వ్యతిరేకించారని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొందురు అంటున్నారు.. జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి.. ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదని సీఎం ఆరోపించారు.
దక్షిణాది రాష్ట్రాల(Southern states)కు ప్రస్తుతం లోక్ సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉందన్న ముఖ్యమంత్రి డీలిమిటేషన్ జరిగితే లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అందరూ ఒకే మాటపై ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెట్టే తీర్మానానికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీ, తెలంగాణలో శాసనసభ(Telangana Legislature) నియోజకవర్గాలను పెంచాలని పునర్విభజన చట్టంలో ఉంది.. కానీ ఇప్పటి వరకు శాసనసభ నియోజకవర్గాలను పెంచలేదని ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే సిక్కిం, జమ్ముకశ్మీర్ నియోజకవర్గాలను పెంచారు. రాజకీయ ప్రయోజనం లేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచలేదని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. 24 శాతం ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి 36 శాతం పన్నులు కడుతున్నాయి. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ వస్తున్నాయని చెప్పిన సీఎం రేవంత్ ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ కు కేంద్రం పన్నుల్లో ఎక్కువ వాట ఇస్తోందని పేర్కొన్నారు.