పొద్దుటూరు,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరులో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్ పీరియం పార్కు(Eco-Friendly Experium Park)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మంగళవారం ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎకో ఫ్రెండ్లీ, 25 వేల జాతుల మొక్కలు, వైవిధ్యమున్న శిలలు, శిల్పాలు కలిగిన ఎక్స్ పీరియం పార్కుగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్స్ పీరియం చైర్మన్ రామడుగు రామ్ దేవ్ రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, అనిల్ యాదవ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పార్కులో 1500 మంది కూర్చొనేలా యాంఫీ థియేటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ ను రూపొందించిన రాందేవ్ రావు ఆరున్నరేళ్ల పాటు శ్రమించి పార్కును తీర్చిదిద్దారని, 85 దేశాల నుంచి అరుదైన వృక్షాలు, చెట్లు దిగుమతి చేసుకున్నట్లు ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని, అలాగే అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అన్ని సహజ వనరులున్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి చేయాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, వేములవాడ వంటి ప్రముఖ ఆలయాలున్నాయని, కవ్వాల్, నల్లమల రిజర్వ్, ఫారెస్ట్, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం వెనకబడుతోందని, ఇటీవలే ఎకో టూరిజంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించామన్నారు. పర్యాటక పాలసీ తీసుకువచ్చిన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించి త్వరలోనే వికారాబాద్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉందన్నారు. వరితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని, తెలంగాణను ప్రకృతివనంగా మర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.