హైదరాబాద్: నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సోమవారం ప్రారంభం అయింది. చేనేత అభయహస్తం లోగోను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. చేనేత కళాకారులు, నూతన ఆవిష్కర్తల కోసం ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేశారు. చేనేత ఆవిష్కరణల ప్రోత్సాహానికి ప్రత్యేక కోర్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐఐహెచ్‌టీ అధునాతన పరిశోధన అవకాశాలు కల్పించనుంది. ఏటా 60 మందికి టెక్స్ టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుంది. ఐదుగురు ఐఐహెచ్‌టీ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కాలర్ షిప్ లు ఇచ్చారు. నెలకు రూ. 2500 చొప్పున ప్రభుత్వం స్కాలర్ షిప్ అందిస్తోంది. నేతన్నకు చేయూత పథకం కింద రూ.290 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఐహెచ్‌టీకి అందజేశారు.