హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. జనవరి తొలివారం నుంచి వాడపల్లి నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తా అని సీఎం చెప్పారు. లక్షలాది మందితో వాడపల్లి నుంచి చార్మినార్ కు కదం తొక్కుతాం అని సవాలు విసిరారు. మూసీ పునరుజ్జీవన సంకల్పయాత్ర అనంతరం ధర్మారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మూసీ పునరుజ్జీవం చేస్తుంటే బుల్డోజర్లకు ఎవరైన అడ్డొస్తామంటే తొక్కిస్తామని సంచలన వ్యాఖ్యాలు చేశారు.
తమను ప్రజలు గెలిపించారని, వారికి మంచి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం చెప్పారు. ఎవరో ఇస్తే మేం కూర్చీలో కూర్చోలేదు, ప్రజలు ఓట్లు వేసీ గెలుపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కవిత మూడు నెలలు జైలుకు పోతేనే కేసీఆర్ కు దుఃఖం వచ్చిందని ఎద్దేవా చేశారు. మరి ఏళ్ల తరబడి నల్గొండ ప్రజలు ఈ మూసీ నీటీలో ఇబ్బందులు పడుతుంటే దుఃఖం రాలేదా.. ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.