హైదరాబాద్,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయాల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుందని, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి మాట తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. అన్ని పార్టీలు బీసీలకు 42 శాతాం సీట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కులగణన సర్వేలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నాలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
బీజేపీ నేతల్లో డీకే అరుణ కూడా సర్వేలో పాల్గొన్నాలేదన్నారు. గత ప్రభుత్వం సమగ్రసర్వే నివేదికను ఎందుకు బయట పెట్టలేదని, సమగ్రసర్వే నివేదికను ఒక కుటుంబం ఎందుకు దాచిపెట్టుకుంది..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భూముల వివరాలు అడగటం చూసి చాలామంది నేతలు సర్వేను బహిష్కరించారని, భూముల వివరాలు అడిగితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడ్డారు..?, 2021 జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు చెపట్టలేదు..? అని అడిగారు. దేశంలో 1871 నుంచి క్రమం తప్పకుండా జనాభా లెక్కలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.