calender_icon.png 17 October, 2024 | 9:53 PM

3 నెలలు మూసీ ఒడ్డున జీవిస్తే... ప్రాజెక్టును ఆపేస్తా

17-10-2024 07:00:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మూసీ నది అభివృద్ధి, సుందరీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలంలో వివరాలు వెల్లడిస్తున్నారు. వేల సంవత్సరాలుగా నదుల పక్కనే నాగరికత పెరిగిందని సీఎం పేర్కొన్నారు. నదులు, మానవ జీవితానికి విడదీయరాని బంధం ఉందని, నదుల పక్కన ఉన్న నగరాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ వద్దని ప్రజలు అడ్డుకోలేదా..?, ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి ప్రాజెక్టులు పూర్తి నిర్మించలేదా..? అని సీఎం ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు మేం ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ అనలేదా..?, మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న నేతలు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ 3 నెలలు మూసీ ఒడ్డున ఉండి, అక్కడ ప్రజల జీవితాలు బాగున్నాయని నిరూపిస్తే ఈ ప్రాజెక్టును ఆపేస్తాను అని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. మూసీ పరివాహకంలోనే ఉండి ప్రజల కోసం పోరాడాలని, వాళు 3 నెలలు అక్కడ ఉంటానంటే కావల్సిన వసతులు కూడా కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రజల కోసం ఏం చేద్దామో అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని మూసీ పునరుజ్జీవనం కోసం మీ వద్ద ఉన్న ప్రణాళికలు చెప్పండని కోరారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని మూసీ పునరుజ్జీవనంపై విపక్ష నేతల సందేహాలు, అభ్యంతరాలు ఏమిటో చెపితే మేం సమాధానం చెప్తామన్నారు. 

మూసీ ఒడ్డున జీవిస్తున్న వారికి మంచి జీవితాన్ని ఇద్దామా.. వద్దా..?, దశాబ్దాల పాటు మూసీ ప్రజలను అలాగే దుర్గంధంలోనే ఉంచాలా..? అని ప్రశ్నించారు. టూరిజం పెరిగిన నగరాలకే ఆదాయం పెరిగిందని, సెలవుల్లో మైసూరు, జైపూర్ అంటూ ఇతర నగరాలకు వెళ్తున్నారు. మైసూరు, జైపూర్ లాగే హైదరాబాద్ కూడా హెరిటేజ్ సిటీగా చేయాలనదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. పర్యాటక డెస్టినేషన్ సిటీగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకుందాం అని సూచించారు. దామగుండం రాడార్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది గత ప్రభుత్వమే అని సీఎం గుర్తు చేశారు. జీవో 111 పరిధిలో భారీ ఫామ్ హౌజ్ లు నిర్మించి పర్యావరణానికి హాని చేసిందెవరు..?. 2017 నాటికే బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని అనుమతులు, భూమిని కేటాయించి.. నిధులు కూడా తీసుకుందని మండిపడ్డారు. దేశ భద్రతకు అవసరమైన ప్రాజెక్టు ఎలా అడ్డుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.