ప్రధాని మోడీ అబద్ధాలు మానుకోవాలి
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముంబయిలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపించారు. ప్రధాని కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్ధాలు చెబుతున్నారు... మోడీ అబద్దాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామని రేవంత్ హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పేందుకు వచ్చానని సీఎం స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయని ఆరోపించారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోడీ భావించారని చెప్పారు. తెలంగాణలో రుణమాఫీ, రూ. 500కే వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వరికి 500 మద్దతు ధర, మహిళలకు ఉచిత ప్రయాణంపై మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. తెంలగాణలో రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేశామన్నారు. 22 లక్షల మంది రైతులకు రూ. 17,869 కోట్లు మాఫీ చేశామన్నారు. రుణమాఫీపై వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. తెలంగాణ రైతుల విషయంలో మోడీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం.. తాను వివరాలు ఇచ్చాక ప్రధాని తన ట్వీట్ ను డిలీట్ చేశారని రేవంత్ పేర్కొన్నారు.