హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం దావోస్‌లో నాలుగు రోజుల పర్యటనను ప్రారంభించింది. సింగపూర్‌లో మూడు రోజుల పర్యటన తర్వాత, ప్రతినిధి బృందం దావోస్‌కు చేరుకుంది. రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్(Telangana Rising) ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చివరి రోజున ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులతో కూడిన బృందం సింగపూర్ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్ తదితరులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు.
సింగపూర్ లో మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. పర్యటనలో ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(Singapore Institute of Technical Education)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది.
రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. సింగపూర్ నుంచి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), అధికారులు దావోస్ కు బయల్దేరనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు(World Economic Forum Annual Meeting 2025)లో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటనకు బయల్దేరుతోంది.