హైదరాబాద్: ప్రముఖ రాజకీయ నాయకుడు, వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఏచూరి అలుపెరగని పోరాటాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, ఆయన మరణం దేశ రాజకీయ రంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి దాదాపు నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారని, ఏచూరి విశేషమైన ప్రయాణాన్ని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఏచూరి దేశవ్యాప్తంగా విస్తృతంగా గుర్తింపు పొందారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.