హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం ఒక సందేశంలో అవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని కొనియాడారు. రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని సీఎం పేర్కొన్నారు.