28-04-2025 01:34:51 PM
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(Kunduru Jana Reddy)తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సోమవారం భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కేకే పార్టీలో చర్చిస్తారని వెల్లడించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలు వేస్తున్నారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టత లేదని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి, నాకు గ్యాప్ ఉందనడం అవాస్తమని సీఎం తేల్చిచెప్పారు. రాహుల్ కు, నాకు ఉన్న సంబంధం ప్రపంచానికి చెప్పనవసరం లేదన్నారు. అవసరాలను బట్టి కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారని సూచించారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని సీఎం ఆకాంక్షించారు. రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) హైదరాబాద్ లోనే టైమ్ పాస్ చేస్తున్నారని చెప్పిన సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు ప్రజల్లో వెళ్లాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు వెళ్తేనే ప్రజల్లోకి పథకాలు వెళ్తాయని చెప్పారు. ఆపరేషన్ కగార్ పై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.. పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని తెలిపారు. అధికారుల విషయంలో ప్రభుత్వం కొంత సమన్వయం పాటించాలని సూచించారు.