calender_icon.png 19 April, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యంగ్ ఇండియా నా బ్రాండ్

10-04-2025 01:38:53 PM

యంగ్ ఇండియా నా బ్రాండ్ 

మహాత్మా గాంధీ నాకు స్ఫూర్తి  

అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు 

పీవీ అందరికీ దార్శనికుడు  

అధిక జనాభా ఉన్న దేశంలో ఒలంపిక్స్ లో ఒక బంగారు పతకం కూడా రాలేదు  

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి  

రాజేంద్రనగర్: యంగ్ ఇండియా తన బ్రాండ్ అని, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఇది ప్రారంభించినట్లు రేవంత్ రెడ్డి అన్నారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఆయన మంత్రి శ్రీధర్ బాబు, డిజిపి జితేందర్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, శాసనమండలి విప్ మహేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ చైర్మన్ తో కలిసి గురువారం ఉదయం  ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఖాకీ డ్రెస్ వేసుకున్న హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు ప్రతి పోలీసు పిల్లలు ఇండియా పోలీస్ స్కూల్లో చదువుకోవచ్చు అన్నారు. పోలీసు శాఖపై తనకు ప్రత్యేక అవగాహన ఉందన్నారు. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బిజిలీ, పానీ, సడక్ అనే నినాదంతో ముందుకు సాగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రముఖ యూనివర్సిటీలకు జవహర్ లాల్ నెహ్రూ బీజం వేశారన్నారు. పివి మన దేశ ప్రజలందరికీ దార్శనికుడు అని కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గిరిజనులు, ఆదివాసులు, ఇతర అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆమె రోటి, మఖాన్ అనే విధానంతో ముందుకు సాగారని తెలిపారు. 

మీ బ్రాండ్ ఏంటని అడుగుతున్నారు..

ముఖ్యమంత్రి అయ్యి 16 నెలలు అయిందని, విశ్లేషకులు, విలేకరులు మీ బ్రాండ్ ఏంటని అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఏ విజన్ కోసం పనిచేస్తున్నానో వారు అర్థం చేసుకునే స్థితిలో లేరని సీఎం చురకలు అంటించారు. ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు కొందరు మాత్రమే విజన్ క్రియేట్ చేస్తారని తెలియజేశారు. ఐటీ కంపెనీలను చూస్తే చంద్రబాబు గుర్తొస్తారని.. రైతులు, ఉచిత విద్యుత్ ను చూస్తే దివంగత ముఖ్యమంత్రి వై ఎ స్సార్ గుర్తోస్తారని తెలిపారు. తాను విశ్లేషణకులందరికీ చెబుతున్నానని, నా బ్రాండ్ యంగ్ ఇండియా అని తెలిపారు. అత్యధిక జనాభా ఉన్న మన దేశం నుంచి ఎంతోమంది ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొన్నా కనీసం ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఏటా ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకుంటున్నావారిలో ఏమాత్రం నాణ్యత లేదని వాపోయారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ప్రారంభించుకున్నామన్నారు.  దానికి మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ను చైర్మన్ గా నియమించుకున్నామన్నారు.   రాజకీయాలకు అతీతంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు పలువురిని అందులో డైరెక్టర్లుగా నియమించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూళ్లను ఎంతో అధునాతన వసతులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో స్కూల్ కు 200 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు పాఠశాల తరగతి గదుల్లోనే ఉందన్నారు. అనంతరం సీఎం అతిథిలతో కలిసి స్పోర్ట్స్ డ్రెస్, వాటర్ బాటిల్స్ ఇతర వస్తువులు ఉన్న మ్యాజిక్ బాక్సులను విద్యార్థులకు అందజేశారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో..

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించినట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పోలీసులు శాంతిభద్రతల కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు కూడా వారు మన కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలిపారు. జాతీయ ప్రమాణాలతో ప్రైవేటు విదకు పోటీగా యంగ్ ఇండియా స్కూల్లో విద్యను అందిస్తామన్నారు. ఆర్మీ స్కూల్, హెచ్పిఎస్ స్కూల్ మాదిరిగా దీనిని తీర్చిదిద్దుతామన్నారు. డిజిపి జితేందర్ మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పోలీసుల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిపి, యంగ్ ఇండియా స్కూలు చైర్మన్, సివి ఆనంద్ మాట్లాడుతూ.. పోలీసుల పిల్లలు స్కూలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాల యాదయ్య కంభం అనిల్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.