15-03-2025 02:26:17 PM
ఆడబిడ్డలు నన్ను రేవంతన్నా అని పిలుస్తున్నారు
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగింది సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రుణమాఫీ, పండించిన పంటలు, కొనుగోలు చేసిన పంటల గురించి చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. విధాన పరమైన నిర్ణయాలు, వ్యవసాయ పాలసీ, ఎనర్జీ పాలసీ గురించి మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేసీఆర్ ను తారీఖు చెప్పమనండి.. రైతులు, ఇతర ఏ అంశంపైనా సరే కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చర్చ కోసం సూచన చేస్తే సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
మహాలక్ష్మీ పథకం(Mahalakshmi scheme) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాం. మహాలక్ష్మీ పథకం కింద రూ. 5,500 కోట్లు ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మహిళలను లక్షాధికారులను చేయాలన్న సంకల్పంతో 1000 ఆర్టీసీ బస్సులు అందించామని పేర్కొన్నారు. అదానీ, అంబానీలతో పోటీపడేలా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు ఆడబిడ్డలతో చేయించామన్నారు. ఆడబిడ్డలు ఆనాడు ఇందిరమ్మను అమ్మ అన్నారు.. ఎన్టీఆర్ ను అన్న అన్నారు.. ఇవాళ నన్ను రేవంతన్నా అని పిలుస్తున్నారని చెప్పారు. కేసీఆర్ సభకు రండి.. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాదన్న సీఎం రేవంత్ రెడ్డి, మీ అనుభవం చెప్పు.. నేను తీసుకుంటానని పేర్కొన్నారు.